Tuesday, December 30, 2014

బ్రాహ్మణుడు

భగవంతునియొక్క ముఖమునుండి ఉద్భవించిన వాడు బ్రాహ్మణుడు కాబట్టి "బ్రాహ్మణోస్యముఖమాసేత్" అని అంటారు.తరువాత, సృష్టిలో సమస్త కర్మలు ఆచరింప చెయ్యడానికి పుట్టినవాడు బ్రాహ్మణుడు. నాలుగు వేదాలను అవపాసనచేసి నిత్య యజ్ఞయాగాది కృతులు,పితృదేవతల ఖర్మలు, ఇత్యాదికములు నిర్వర్తించడానికి బ్రాహ్మణుడు అర్హుడై ఉన్నాడు.జన్మలో పరమ ఉత్కృష్టమైనటువంటిది మానవజన్మ అటువంటి మానవజన్మలో చాలా విశేషప్రదమైనది బ్రాహ్మణజన్మ.
"తన్ మంత్రం బ్రహ్మణాదేన
 మంత్రాదేనంతు దేవత:
 బ్రాహ్మణో మమదేవత:"
అనగా "మంత్రాలన్నీ బ్రాహ్మణుల అధీనంలో ఉంటాయి; దేవతులందరూ మంత్రాలలో ఉంటారు; బ్రాహ్మణుడే దేవుడికింద పూజింపబడుతున్నాడు". 
ఉపనయనసంస్కారాల తరువాత ప్రతినిత్యము సాయంసంధ్యోపాసన సూర్యనమస్కారములు చేసి జగత్తును రక్షించవలసిన బాధ్యత బ్రాహ్మణునిదే.ఎందుచేతనగా ఉపనయన విధానంలో తండ్రి లేదా గురువు చేత గాయత్రి ఉపదేశం పొంది ఉంటాడు కాబట్టి సర్వజగద్రక్ష బ్రహ్మ స్వరూపిణి అయిన గాయత్రిమాతను ప్రతి బ్రాహ్మణుడు పూజించాలి.
ఆ గాయత్రి దేవిని పూజించడానికి, ఉపదేశం పొందే సమయంలో ప్రతి బ్రాహ్మణునికి ఉపనయన సంస్కారాలు నిర్వర్తిస్తారు.ఈ ఉపనయన సంస్కారాల్లో యజ్ఞోపవేతం ధరింపజేస్తారు; ఎంతో పవిత్రమైనటువంటిది బ్రహ్మసూత్రం.
జగత్తులో ప్రత్యక్షదైవం సూర్యభగవానుడు. "అలంకార ప్రియహో విష్ణుహు; అభిషేక ప్రియహో శివ:; నమస్కార ప్రియహో భాస్కర:". అందుచేతనే ప్రతి ఒక్కరు ఉదయం స్నానమాచరించిన తరువాత రెండు చేతులు శిరస్సుపైనుంచి భాస్కరునికి కింది స్లోకంతో నమస్కారం చేస్కోవాలి.
"ఆదిదేవా నమస్తుభ్యం, ప్రసీద భాస్కర;
దివాకర నమస్తుభ్యం, ప్రభాకర నమోస్తుతే"
ఎందుకంటే ఆరోగ్యం ప్రసాదించేవాడు భాస్కరుడు.
"ఆరోగ్యం భాస్కరాధిచ్చ్యేత్"
శివ

Sunday, December 28, 2014

శివ కోసం శివ

ఈ లోకానికి నీవే స్థితి, గతి;
పశుపక్ష్యాదులకు నీవే పశుపతి;
మానవాళికి నీవే అధిపతి;
నీ కరుణకు ఉండబోదు వెలితి;
నీ దయకు ఉండదు పరిమితి;
భేదభావములు లేనిది నీ తరగతి;
నిన్ను ధిక్కరించినవాని పరిస్థితి అధోగతి;
ఎల్లవేళలా నా మదిలో మెదులును నీ నామ స్తుతి;
ప్రపంచం మొత్తానికి నీవే ఏకచక్రాధిపతి;
శివ

నేనెరిగిన ఘంటసాల

ఆయన పేరు ఘంటసాల.తెలుగు సినీ సంగీతానికి ఆయనొక్కడే ఒక పాఠశాల.
ఆయన గొంతు గంభీరం; ఆలాపన అమృతవర్షం; పాట అజరామరం; మనం పొందే ఆనందం వర్ణనాతీతం.
సాధారణంగా మనకి ముత్యపుచిప్పలన్నిటిలో మచ్చూక్కి మాత్రమే మంచి ముత్యాలు దొరుకుతాయి; కాని ఈయన ప్రతీ పాటా ఆణిముత్యమే.నందమూరి తారక రామరావుగారైనా,అక్కినేని నాగేశ్వర రావుగారైనా, పాటైనా, పద్యమైనా, సంగీత దర్శకుడు ఎవరైనా, సినీ దర్శకుడు ఎవరైనా ప్రతీ సినిమాకి కేవలం అతని స్వర మాధుర్యంతోనే ఎన్నో విజయాలు చేకూర్చారు.అంతటి మహానటుల  సినిమాలు సంగీతపరంగా విజయఢంకా మ్రోగించాయంటే అది కేవలం ఘంటసాల గారివల్లే అనడంలో అతిశయోక్తి లేదు.
ముఖ్యంగా చెప్పుకోవాల్సినది గీతరచయితల మాటకి; సంగీత దర్శకుల స్వరానికి; ఈయన గాత్రానికి పదునెక్కువ, అందుకనే ఈనాటికి కూడా ఇంకా ఆ పాత మధుర గీతాలు శ్రోతల మనసుల్నితాకుతున్నాయంటే అది మనం చేస్కున్న అదృష్టం.
నేను ఈ కాలం వాడినైనప్పటికీ చిన్నప్పట్నుంచీ ఆ పాటలు వింటూనే పెరగడం వలన ఆయనంటే అభిమానం కన్నా ఒక రకంగా భక్తి ఏర్పడింది; ఎంతైనా గాన గంధర్వుడు కదా ఆయన!పాట రేడియో లో విన్నా ద్రుశ్యమంతా మదిలో మెదులుతుంది, ఇంతకన్నా ఆ మాధుర్యానికి ఇంకేం నిదర్శనం కావాలి?

పది పన్నెండువేలు పైబడిన పాటలే ఉన్నా; అన్నీ నాకిష్టమే అయినా అందులోనూ నా మనసుకు దగ్గరగా ఉన్నవైతే - భగవద్గీత, శివ శంకరి, రసిక రాజ, నందుని చరితము వినుమా, మోహన రాగమహా, ఎవరివో నీవెవరివో, కొండగాలి తిరిగింది, ఊహలు గుసగుసలాడే, మాణిక్యా వీణా, అదే;అదే వింత నేను తెలుసుకున్నది, జగమే మారినది మధురముగా ఈ వేళ, పాడుతా తియ్యగా సల్లగా, ఘనాఘన సుందరా, రాగమయే రావే, లాహిరి లాహిరి లాహిరిలో, నన్ను దోచుకుందువటే, దినకరా శుభకరా...ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా ఆగనే ఆగదు ఎందుకంటే ఆయన పాటల ప్రపంచం ఆద్యంతం అద్భుతం.
ఇక్కడితో శ్రీ ఘంటసాల గారికి అనంతకోటి నమస్కారాలతో ముగిస్తున్నా, వయసులో చిన్నతనం; అభిమానంలో అనంతం.
మీ చిరు అభిమాని.
శివ

Saturday, December 27, 2014

pk - నా రివ్యూ

ఒక అద్భుతమైన సినిమా... ప్రస్తుత దేశ ప్రజల పరిస్థితులకు అనుగూణంగా ఒక పరిణితి చెందిన నటుడితో తీసిన సినిమా...ఒక గ్రహాంతరవాసి భూమండలాన్ని సందర్శించుటకై వచ్చి ఎదురుకున్న పరిస్థితులు, పరిణామాలు అన్ని అద్భుతంగా తెర మీద ఆవిష్కరించబడినవి.ముఖ్యంగా ఆమిర్ ఖాన్ భావ వ్యక్తీకరణ వర్ణనాతీతం.తనదైన శైలిలో సినిమాని తన భుజం మీద వేసుకుని మరీ నడిపించాడు.ఏ పాత్ర కి ఆ పాత్ర సంపూర్ణ న్యాయం చేకూర్చారు.సినిమా కోసమని వేరేగా హాస్య సన్నివేసాల్ని రచించకుండా కథానాయకుడి మాండలికంతోనే పండించాల్సిన హాస్యాన్నంతా సమకూర్చిన దర్శకుని తెలివితేటలను మెచ్చుకోవాలి.తనకొచ్చిన సందేహాలు మరియు దొరికిన సమాధానాలు అన్ని బాగానే ఉన్నాయి. కాని చిక్కంతా కొన్ని సన్నివేశాలతోనే!!! హిందు సాంప్రదాయాల మీద తను సంధించిన కొన్ని ప్రశ్నలు హిందువులను ఆగ్రహానికి గురిచేసేలా ఉన్నాయి.ముఖ్యంగా శివుడిని శౌచాలయములో ఇబ్బంది పెట్టే సన్నివేశం గాని నోట్లో వేస్కునే తాంబూలంలో ఉన్నదానిని రాయికి కుంకుమలా రాసి,చిల్లర వేసి,లింగానికి క్షీరాభిషేకము మీద ప్రశ్నలు మరియు సాష్టాంగ ప్రదక్షిణలు మీద ప్రశ్నలు వేసి, వ్యంగ్యంగా మాట్లడటం అన్నది కొంచం అసహనానికి గురిచేసిందనే చెప్పచ్చు.తమను తాము బాబాలని, దైవాంస సంభూతులమని చెప్పుకు తిరిగే వారిని మీద వ్యంగ్యాస్త్రాలే కాకుండా దండయాత్ర చేసినా తప్పు లేదు కాని ఏకంగా భగవంతుడిమీదనే వ్యంగ్యాస్త్రాలు వెయ్యడం అన్నది తప్పు గా పరిగణించబడుతుంది.హిందూ మతంలో అభిషేకానికి,సాష్టాంగ ప్రదక్షిణలకి,ఇంకొన్ని పద్ధతులకి చాలా కారణాలున్నయి. అవన్నీ తెలుసుకుని ఉండుంటే బాగుండును.ఒకవర్గానికి చెందిన వారి మనోభావాలను కించపరచడం అందులో రాజ్ కుమార్ హిరాని లాంటి దర్శకుడు ఎంతైనాతప్పు కిందే లెక్కవస్తుంది.కేవలం దొంగ బబాలమీదే మీ ఆలొచనలను,ప్రశ్నలను సంధించుంటే అందరూ హర్షించేవారు.ఆ కొన్ని సన్నివేశాల్ని పక్కన పెడితే ఇది ఖచ్చితంగా ఒక మంచి సందేశాత్మక చిత్రంగానే పరిగణిచబడుతుంది ఎందుకంటే దొంగ బాబాలని బూతులు తిట్టినా ఫర్వాలేదు గాని సరాసరి దేవుడినే దూషించకూడదు కదా.దేవుని పేరుతో మోసం మరియు వ్యాపారం చేసే వెధవలని ఎన్నన్నా తక్కువే.కేవలం జనాల భయాన్నేపెట్టుబడిగా పెట్టి పబ్బం గడిపే వారు ముఖ్యంగా అన్నిమాతాల్లోనూ ఉన్నారు అందులో మన దేశం లో కోకొల్లలు.అలాంటి వారికి ఈ చిత్రం ఒక హెచ్చరిక అనే చెప్పుకోవచ్చు.
సినిమాలో హీరో అడిగిన ప్రశ్నలన్నీ ఎంతో అద్భుతంగా ఉన్నయి, కాని తాను మనిషిగా నిజ జీవితంలో పాఠిస్తున్నాడా????ప్రశ్నలడిగే వాడికి సమాధానం కూడా తెలిసిఉండాలి కదా!!! లేదంటే ఇది కేవలం సందేహమే ఐతే చిత్రించబడే పద్ధతి ఇది కాదేమో అనిపిస్తోంది...
ఎమో ఇది కూడా కేవలం ధనాన్ని ఆర్జించడానికే తీసుండచ్చేమో అన్న సందేహం కలగక మానదు!!!! మిగతాదంతా ఆ దెవుడెరుగు!!!!!!!!!!

Friday, December 26, 2014

చిన్నదాన నీ కోసం - నా రివ్యూ

ప్రేమ పొంది మొసింపబడి తిరిగి ప్రేమను పొందే ఒక చిన్నపాటి ప్రేమకధను చక్కగా ఆవిష్కరించాడు "చిన్నదాన నీ కోసం" దర్శకుడు. మంచి సంభాషణలతో సాగిపోతుంది సినిమా. ముకుందా కన్నా చాలా మేరకు ఫర్వాలేదనిపించే సినిమా ఇది. ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో గెలిచాడనే చెప్పుకొవాలి. కామెడి బాగా పండింది.అదిరిపోయే కలక్షెన్లు రాకపొయినా ఒక మోస్తరుగా రావచ్చు. కధనుంచి ఎక్కడా పాత్రలు గాడి తప్పకపోవడం గుర్తించాల్సిన విషయం. పాటలు అస్సలు బాలేవు. పిచ్చి గీతలనే పేరిస్తే తన మనసులో ఉన్న రూపం హీరోయిన్ దే అని చూపించిన తీరు వినూత్నం. ఈ వారాంతరానికి బాగా ఆడే సినిమా ఐతె ఇదే. సదరు ప్రేక్షకుడు కోరుకునే కామెడి, లవ్ స్టోరి మెళవింపే ఈ కధ.ఒక్కసారికి ఖచ్చితంగా చూడవచ్చు.

ముకుందా - నా రివ్యూ

ఈ సినిమాలో హీరో అంతటా ఒకటే భావం చూపించటం జరిగింది. ఒకరకంగా అది దర్శకుని కోరికమేరకు అయినా ఆ భావనని హీరో మాటల్లో పలికించలేకపోయాడు. హీరో హీరోయిన్ల మధ్య సంభాషణలే లేకుండా ఒక విధమైన పరిచయాన్ని చూపించడంలో సఫలుడు అయ్యాడనే చెప్పుకుంటే, వారిద్దరి మధ్యన ఉన్న ఆ భావన ఎమిటో చూపడంలో విఫలుడు అయ్యాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే రావు రమేష్ మీద పెట్టిన శ్రద్ధ హిరో మీద పెట్టకపోవడం వలన సినిమా కొంచం తడబాటుకు లోనయ్యింది. స్క్రీన్ ప్లే కూడా బాగ నెమ్మదించింది. స్నేహితుని ప్రేమకధకి అండగా నిలిచిన హీరో తన ప్రేమకధకి కనీసం పునాది కూడా వేస్కోలేకపొవడం గమనార్హం. స్క్రీన్ మీద నిండుగా ఉన్నా శారీరక ధారుడ్యానికి తగ్గ గొంతు గాని సంభాషణలు గాని వరుణ్ తేజ్ కి ఇవ్వడం జరగలేదు. మెగా కుటుంబం నుంచి వచ్చాడన్న మాటే తప్ప సినిమా అంతగా ఆడకపోవచ్చు.టైం పాస్ కే తప్ప టైం వెచ్చించి చూడాల్సినంతగా ఏమి లేదు ఈ సినిమా.ఒక్క పాట కూడా బాలేదు. పేలవమైన బాక్గ్రౌండ్ స్కోర్.చాలా విషయాలు వికటించడంతో ఊహించినరీతికి ఆడకపోవచ్చు.

Tuesday, December 23, 2014

సత్తువు

పట్టపగలు నిద్దరోయె,
మార్గమధ్య వదిలిపోయె,
ధైర్యమంత దగ్ధమాయె,
కష్టపడుట కష్టమాయె,
ఇష్టమంత ఇరుకులాయె,
ధ్యాస దారితప్పెనాయె,
కన్న కలలు కల్లలాయె,
ఓటమి కోకొల్లలాయె,
బ్రతుకంతా భారమాయె,
కాలం కారుమబ్బులాయె,
జీవనం జటిలమాయె,
ద్రుష్టంతా దూరమాయె,

అయితే????
బ్రతుకు భారమైన భవితకి చావే శరణ్యమా?
వికటించిన వదంతుకు పరిహాసమే సమాధానమా?

వగరు చెట్టు తియ్యని పండునివ్వదా?
గులాబి గుత్తునందు గుచ్చెటి ముల్లు ఉండదా?
సత్తువే సాధనమై!
చిత్తశుద్ధియే ఇంధనమై!
నిశ్చల నిరవధిక నిర్విరామ శ్రమతో నేస్తమై!
నింగికేయు నిచ్చెన నిజానికేయరా,
గెలుపు సగటు కాదు సంపూర్ణం చేయరా,
సాగిపో నేస్తమా సాగిపో....
కష్టం కడతేరువరకు, ఇష్టం ఇలచేరువరకు...
సాగిపో సాగిపో సాగిపో...

శివ